Naaku Thochina Maata    Chapters   

అభివందనము

ఆనాడొక పర్వదినము. ప్రతివారి హృదయము భక్తి తరంగితమై పరవశించిన పవిత్రదినము. అంతియగాదు పునీతమై పులకించిన పుణ్యదినము. ఏ మహాత్ముని రాకకో, వేదగానములతో, పూర్ణకుంభముతో పురజను లెదురేగిన పవిత్ర పర్వదినము!

ఆనాడే బ్రహ్మశ్రీ వేదమూర్తులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు ధర్మపత్నీసమేతులై భావపురికి విచ్చేసిన భవ్యదినము పార్వతీపరమేశ్వరులే సాక్షాత్కరించినట్లు సంతసించిన నాటిదినము పర్వదినమేగదా!

నేటి మానవలోకమునకు శ్రీ శాస్త్రిగారివంటి మహోదయులు మణీదీపములవంటివారని భావింపవలయును. ఇట్టివారు జూపు వెల్గుబాటలలో పయనించి తమ జీవితముల ధన్యము లొనర్చుకొనుట అత్యంతావశ్యకము.

శ్రీరామకథామృతముచే సాహిత్యపిపాసువుల చిత్తము అలరించిన కీ.శే. తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిగారి కుమారులు శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారు, వీరు సనాతన ధర్మపరాయణులు, సదాచార సంపన్నులు, తపోనిష్ఠాగరిష్టులు, పరమ నైష్ఠికులు, తేజశ్శాలులు, సాహిత్యవేత్తలు, సమస్త శాస్త్రపారంగతులు మీదుమిక్కిలి సహృదయులు.

వీరు భక్తులకోరిక ననుసరించి భావవురి విచ్చేసిరి. ప్రతిదినము 'నాకు తోచిన మాట' యని ఉపన్యసించుచు శ్రోతల హృదయముల నుఱ్ఱూతలూగించిరి. ఇక నీ యుపన్యాసము లన్నియు వినుటయేగాక, వీనికొక రూపముదెచ్చుట ఆవశ్యకమని సంకల్పమొకటి జనించినది. తదనుగుణముగ వారు ప్రసంగించునపుడు శ్రీ ఇనుపకుతిక వీరరాఘవశాస్త్రిగారు, శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మగారు, నేనును ఆ యుపన్యాసకుసుమముల సేకరింప మొదలిడితిమి. పిమ్మట నా యోపినకొలcది, యివియన్నియు నొకచోcజేర్చి, ఒక రూపముదెచ్చి శ్రీ శాస్త్రిగారికి నివేదించితిని. వారును భారమనక వ్రాతప్రతిని ఆసాంతము చదివి, అచ్చటచ్చట మార్పులు, చేర్పులు కావించిరి. అంతియగాదు భారతవిషయమును గొంత వారే స్వయముగా వ్రాసియిచ్చిరి. దీనికంతయు మరల నొక శుద్ధప్రతిని తయారుచేయ నిట్టిరూపము ధరించినది.

cక స్వవిషయము, ఎందఱో వేదాంతతత్త్వమెఱిగిన విద్వాంసులుండగ నాబోటి యల్పజ్ఞుడు ఇందులకు సాహసించుట హాస్యాస్పదమనకతప్పదు. ఈ విషయములలో నా యనుభవ మత్యల్పము. ఇక వయస్సన్నచో నందుల కంగీకరింపనిది. అయినను అంతయో, ఇంతయో ఆస్తికుడనుగాన ఇందులకు సాహసించితిని. కావి ''ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహు రివ వామనః'' అని కాళిదాసు డన్నట్లున్నది నా పని. బ్రహ్మదేవు డెవరినెట్లు ఏపనులయందు వినియోగించునో యెవరికెఱుక? ఆ బ్రహ్మచేష్ఠితములు ఆశ్చర్యజనకములుగదా! ఏమైనను యేనాటి పురాకృత పుణ్యవిశేషలేశమో నన్నిట్లు ప్రేరేచినదని వినయముగా విన్నవించుచున్నాను.

''పితాపుత్ర కవి చరిత్రము'' వ్రాసియిచ్చి పొత్తమునకు దీప్తి నింపిన శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రిగారికి నమస్కృతులు.

ఈ గ్రంథప్రచురణలో నాతోగలపి ప్రూపులు చూచియు, చక్కని సలహాలనిచ్చి సహకరించిన సహృదయులు ప్రియమిత్రులు శ్రీ బి. రాజేశ్వరరావుగారికి కృతజ్ఞతలు.

ఈ గ్రంథమున నెచ్చటేని దోషములున్న నవి నానిగా భావించి మన్నించెదరని మనవి. ఇక ఒప్పులన్నియు శ్రీ శాస్త్రిగారికే చెందును.

ఇట్లి ది వెలుగుచూచుటకు మాతో సహకరించిన మహానుభావులెందరో, అందరికి వందనములు.

బాపట్ల ఇట్లు,

16-2-72 నెమ్మాని సీతారామయ్య, ఎం.ఏ.

ఆంధ్రోపన్యాసకులు - ఆర్ట్సు కళాశాల.

Naaku Thochina Maata    Chapters